Genesis 15

1ఈ సంగతులు జరిగిన తరువాత యెహోవా దూత అబ్రాముకు దర్శనమిచ్చాడు. << అబ్రామూ, భయపడకు! నేనే నీకు డాలును, గొప్ప బహుమానాన్ని>>అన్నాడు. 2అబ్రాము, <<ప్రభువా యెహోవా, నాకేం ఇస్తావు? నేను సంతానం లేనివాడిగా ఉండిపోతున్నాను కదా. దమస్కు వాడైన ఎలీయెజెరే నా ఆస్తికి వారసుడు అవుతాడు కదా! 3నువ్వు నాకు సంతానం ఇవ్వలేదు గనుక, చూడు, నా సేవకుల్లో ఒకడు నాకు వారసుడు అవుతాడు>> అన్నాడు.

4యెహోవా వాక్కు అతని దగ్గరకు వచ్చి <<ఇతడు నీ వారసుడు కాడు. నీ ద్వారా నీకు పుట్టబోయేవాడే నీ వారసుడు అవుతాడు>> అన్నాడు. 5ఆయన అతణ్ణి బయటకు తీసుకువచ్చి <<నువ్వు ఆకాశం వైపు చూసి, ఆ నక్షత్రాలు లెక్కపెట్టడం నీకు చేతనైతే లెక్కపెట్టు>> అని చెప్పి, <<నీ సంతానం కూడా అలా అవుతుంది >> అని చెప్పాడు.

6అతడు యెహోవాను నమ్మాడు. ఆ నమ్మకాన్నే ఆయన అతనికి నీతిగా పరిగణించాడు. 7యెహోవా << నీకు ఈ ప్రదేశాన్ని వారసత్వంగా ఇవ్వడానికి కల్దీయుల ఊర్ అనే పట్టణంలో నుంచి నిన్ను ఇవతలకు తీసుకువచ్చిన యెహోవాను నేనే>> అని చెప్పినప్పుడు 8అతడు <<ప్రభువా యెహోవా, ఇది నాకు సొంతం అవుతుందని నాకు ఎలా తెలుస్తుంది?>> అన్నాడు.

9ఆయన <<మూడేళ్ళ వయసు ఉన్న ఒక దూడ, ఒక మేక, ఒక పొట్టేలు, ఒక తెల్ల గువ్వ, ఒక పావురం పిల్లను నా దగ్గరకు తీసుకురా>> అని అతనితో చెప్పాడు. 10అతడు వాటిని తీసుకొని వాటిని సగానికి రెండు ముక్కలుగా నరికి, రెండు సగాలను ఎదురెదురుగా పెట్టాడు. పక్షుల్ని మాత్రం ఖండించలేదు. 11ఆ మృతదేహాల మీద గద్దలు వాలగా అబ్రాము వాటిని తోలివేశాడు.

12చీకటి పడుతున్నప్పుడు అబ్రాముకు గాఢ నిద్ర పట్టింది. భయం కలిగించే చిమ్మచీకటి అతణ్ణి ఆవరించింది. 13ఆయన, <<దీనిని ఖచ్చితంగా తెలుసుకో. నీ వారసులు తమది కాని దేశంలో పరదేశులుగా నివాసం ఉంటారు. ఆ దేశవాసులకు బానిసలుగా నాలుగు వందల సంవత్సరాలు అణచివేతకు గురి అవుతారు.

14వీళ్ళు దాసులుగా ఉన్న ఆ దేశానికి నేను తీర్పు తీరుస్తాను. ఆ తరువాత వాళ్ళు అపారమైన సంపదతో బయటకు వస్తారు. 15కాని, నువ్వు నీ తండ్రుల వద్దకు ప్రశాంతంగా చేరుకుంటావు. పండు ముసలితనంలో మరణించి పాతిపెట్టబడతావు. 16అమోరీయుల అక్రమం ఇంకా హద్డు మీరలేదు గనుక, నీ నాలుగవ తరం ప్రజలు ఇక్కడకు తిరిగి వస్తారని కచ్చితంగా తెలుసుకో>> అని అబ్రాముతో చెప్పాడు.

17సూర్యుడు అస్తమించి చీకటి పడినప్పుడు, పొగ లేస్తున్న కొలిమి, మండుతున్న కాగడా దిగివచ్చి పేర్చిన మాంస ఖండాల మధ్యగా దాటుకుంటూ వెళ్ళాయి. 18ఆ రోజున యెహోవా, <<ఐగుప్తు నది నుంచి, పేరుగాంచిన యూఫ్రటీసు నది వరకు ఉన్న ఈ ప్రదేశాన్ని నీ వారసులకు ఇస్తాను. 19కేనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, 20హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయీయులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ వారసులకు దాసులుగా చేస్తాను>> అని అబ్రాముతో నిబంధన చేశాడు.

21

Copyright information for TelULB